కాకాని వెంకటరత్నం సంక్షిప్త జీవిత చరిత్ర

కాకాని వెంకటరత్నం 1900 సంవత్సరం ఆగస్టు మూడో తేదీన జన్మించారు. పూర్వ కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా ఆకునూరు ఆయన జన్మస్థలం. తండ్రి కాకాని చిన తాతయ్య. తల్లి సీతమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. బాల్యంలోనే వెంకటరత్నంలో నాయకత్వ లక్షణాలు కన్పించాయి. తోటి పిల్లలను చేరదీసి గ్రామంలో వేడుకల సందర్భంలో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. సేవాభావంలె ఆయన్ని కొలిచే డిగ్రీలు రాలేదు. పెద్దిభొట్ల నరసయ్య అనే ప్రైవేటు మాస్టారు దగ్గర ఐదో తరగతి వరకు చదివారు. అప్పట్లో గ్రామంలో ప్రాథమిక పాఠశాల కూడా లేదు. వెలగపూడి నాగభూణషణం, సజ్జా రాఘవయ్య, కాకాని కోటయ్య, (పెదనాన్న కుమారుడు) ఎండూరి రామలింగయ్య,పోతినీడి బాపయ్య కాకాని వెంకటరత్నం తరగతి సహచరులు. చదువులో, ఆటల్లో కాకాని ముందుండేవారు.శతకాలు, ఆంధ్రనామ సంగ్రాహం చదవటంతో తెలుగు భాష మీద పట్టువచ్చింది.తర్వాత కాలంలో హిందీ సహ అన్యభాషలనూ సాధన చేశారు. ఆరోజుల్లో అనేమంది రైతు బిడ్డల్లానే వ్యవసాయం చేశారు. సేద్యం అంటే ప్రాణం. తమ పొలంలో అధిక దిగుబడి తెచ్చారు.జలవనరులు లేని పొలానికి చిన్న కాల్వలు (బోదులు)తవ్వి నీరు పారేలా చేశారు. కుల,మతాలకు అతీతంగా గ్రామ రైతుల భూములకు నీటి వసతి ఏర్పర్చటానికి చొరవ తీసుకున్నారంటే ఆయన విశాల హితాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ సేవాభావంతోనే రైతాంగం అభిమానం పొందారు. తర్వాత కాలంలో కృష్ణా జిల్లాబోర్డు అధ్యక్షుడయ్యారు. ఓ వైపు వ్యవసాయం. మరో వైపు రాజకీయాల్లో రాణించారు.వ్యాపారం పేరుతో దేశంలో తిష్టవేసిన ఈస్టిండియా గిడ్డంగుల రక్షణకోసం సాయుధ దళాలను ఏర్పర్చుకుంది,తర్వాత రాజులను లొంగదీసుకొని దేశాన్ని తన ఆధిపత్యం కిందికి తెచ్చుకుంది. తర్వాత రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య హస్తగతం చేసింది.
బ్రిటిష్ ప్రభుత్వ కుట్రలను ఎదిరించి పోరాడిన స్వదేశీ సంస్థానాధీశుల పోరాట గాధలు కాకాని వెంకటరత్నంను ప్రభావితం చేశాయి. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించే సిపాయిల తిరుగుబాటు,ఝాన్సీరాణి లక్ష్మీ బాయి వీరోచిత పోరుగాధలు,]సాహస ఘట్టాలు,ఆంధ్రావనిలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో మన్యం పోరాటం ఆకర్షించాయి.
ఈ గడ్డకు ఏమీ కాని బిడ్డ డాక్టర్ అనీ బిసెంట్ ఎక్కడో ఐర్లండు నుంచి వచ్చి ఇక్కడి ప్రజలను మేల్కొలుపుతూ సాగించిన స్వపరిపాలనోద్యమం(హోమ్ రూల్ మూవ్ మెంట్)కాకాని వెంకటరత్నం సహా నాటి యువతకు ప్రేరణనిచ్చింది. 1919నుంచి1924ఖిలాఫత్ ఉద్యమం,ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నేతృత్వంలో ఖుదై ఖద్మత్ గార్‌ (భగవంతుని సేవకులు) ఉద్యమంతో స్ఫూర్తి పొందారు.నేటి అప్ఘనిస్తాన్ ప్రాంతంలో జన్మించి,దేశ విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ తో కలసి పనిచేసిన గఫార్ ఖాన్‌ (సరిహద్దుగాంధీ)ను కాకాని స్ఫూర్తిదాతగా భావించారు.
1921 విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం. గాంధీజీ కి చూసేందుకు గ్రామ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు తరలి వెళుతున్నారు. ఆ సమయంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలోl 'రామదండు'సాయుధ పటాలంలా ఉక్కు క్రమశిక్షణతో కవాతు చేశారు. గాంధీజీకి జై, కాంగ్రెస్ కి జై నినాదాలు మిన్నంటుతున్నాయి.అలా బెజవాడ కాంగ్రెస్ సమావేశాలు, సభలు యువతలో జాతీయ భావాన్ని నింపాయి.
స్వదేశీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలం. కాకాని వెంకటరత్నం తమ ఇంట్లోని ఇతర మిత్రుల ఇళ్లలోని విదేశీ వస్త్రాలు తెప్పించి ఊరి మధ్యలో దహనం చేశారు. 'విదేశీ ప్రభుత్వం నశించాలి', 'అందరూ ఖద్దరు ధరించాలి అని చేసిన నినాదాలతో ఊరంతా దద్దరిల్లింది. ఏఐసీసీ సమావేశాల తరువాత మహాత్ముడు తిలక్ స్వరాజ్య నిధి వసూళ్లకు కృష్ణా జిల్లా గ్రామాలలో పర్యటించారు.
ఈ క్రమంలో కాకాని వెంకటరత్నం గాంధీజీని స్వగ్రామం ఆకునూరుకు ఆహ్వానించారు. గ్రామస్తుల పక్షాన.ఖద్దరు నిధికి రూ.116, స్వరాజ్య నిధికి ఎండూరి రామలింగయ్య గారి తో రూ.200ఇప్పించారు.కాకాని కార్యసాధనకు గాంధీ ముగ్ధుడయ్యార.తరువాత వరుసగా ఉయ్యూరు లో,కమ్మమూరు లో గాంధీజీ సభ ఏర్పాటు చేయించారు.తనకు లభించిన ఘన సత్కార,స్వాగతానికి గాంధీజీ సంతోషించారు. తరువాత1923లో కాకినాడ లో గాంధీ సభకు హాజరయ్యారు.ఆ సభలు. చారిత్రాత్మకమైనవి. గాంధీజీనే కాకుండా ఇతర జాతీయ నాయకులు షౌకతాలి, మహమ్మద్.అలీ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, ఆయన కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ,వల్లభాయి పటేల్, రాజేంద్ర ప్రసాద్, అజ్మల్ ఖాన్, అన్సారీ తదితరులు హాజరయ్యారు. మహా నాయకులు అందరినీ ఒకే వేదిక మీద.చూసి కాకాని వెంకటరత్నానికి సమరోత్సాహం కలిగింది.
కాకాని వెంకటరత్నం హిందీ భాషా ప్రచారోద్యమ ప్రభావంతో హిందీ నేర్చుకున్నారు. ఉన్నవ రాజగోపాల కృష్ణయ్య గారి ప్రోత్సాహంతో హిందీ అభ్యసించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన రాష్ట్రభాష పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. హిందీ బాగా నేర్చుకొని ఉత్తరాది వెళ్లినప్పుడు హిందీలోనే సంభాషించారు. కారాగారంలో ఉన్నప్పుడు ఆంగ్లం నేర్చుకున్నారు.
కాంగ్రెస్ చట్టసభల్లో పాల్గొనవచ్చా లేదా? అనే తర్జనభర్జనలు సాగుతున్న వేళ కాకాని వెంకటరత్నం చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూల నేతృత్వంలో ని స్వరాజ్య పార్టీలో చేరారు.
 ఆంధ్రలో టంగుటూరి ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశర్వరావు ఈ పార్టీకి అండగా నిలిచారు. కృష్ణా జిల్లాలో కాకాని అయ్యదేవర కాళేశ్వరరావు సహచరులుగా వున్నారు. కాళేశ్వరరావు నాటి ఉమ్మడి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. విజయవాడ మునిసిపాలిటీని కాంగ్రెస్ గెలిచింది.
భగత్ సింగ్‌, బటుకేశ్వరదత్ లు పార్లమెంటులో బాంబులు విసిరిన ఘటన దేశంలో యువతరంలో ఉత్తేజం నింపింది. కాకానికి ప్రేరణనిచ్చింది.
కాకాని 1927లో మద్రాసు, 1928 లో కలకత్తా కాంగ్రెస్ మహాసభలకు కాకాని ఒక కార్యకర్తగా హాజరయ్యారు. సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రవేశపెట్టాలా? వద్దా అని అగ్రనేతల మధ్య జరిగిన చర్చ కాకానిలో కుతూహలం రేపింది. 1928 కలకత్తా కాంగ్రెస్ మహాసభలో మోతీలాల్ నెహ్రూ కమిటీ రూపొందించిన అఖిలపక్ష నివేదిక మీద చర్చ చరిగింది. ఇందులో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం పెట్టాలని సుభాష్ చంద్రబోస్ వాదించారు. ఆంధ్రకు చెందిన బులుసు సాంబమూర్తి అనుకూలంగా మాట్లాడారు. అయితే మహాత్ముని సూచన మేరకు వేచి చూశారు. 1929 డిపెంబర్ లో లహోర్ లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. ఎట్టకేలకు ఈ మహాసభలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రవేశపెట్టారు.1930 జనవరి 26న దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించాలని. స్వాతంత్ర్య ప్రమాణ పత్రం చదవాలని, పూర్ణ స్వరాజ్యం కోసం శపథం చేయాలని కాంగ్రెస్ సమావేశం దేశప్రజలకు పిలుపునిచ్చింది.సంపూర్ణ స్వరాజ్యసాధనకు శాసనోల్లంఘన చేయాలని, ఇందుకు సత్యాగ్రహం పాటించాలని 1930 మార్చిలో గాంధీజీ నిర్ణయించారు. అంతకు ముందే గాంధీజీ దేశ పర్యటనకు బయలుదేరారు.
1930 ఉప్పు సత్యాగ్రహం
మహాత్ముని పిలుపుతో 1930లో దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఆరంభమైంది. మహాత్ముడు సబర్మతీ ఆశ్రమం నుంచి దండి కి యాత్రగా ఎనభైమంది కార్యకర్తలతో బయలుదేరి ఉప్పు చట్టాన్ని ధిక్కరించారు. శాసనోల్లంఘన చేశారు.ఆంధ్రనేతలు కొండావెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీజీని కలసి ఆంధ్రలో ఉప్పుసత్యాగ్రహానికి అనుమతి తీసుకుని వచ్చారు. గుంటూరు లో కాంగ్రెస్ మహాసభ ఉప్పుసత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. పశ్చిమ కృష్ణాజిల్లా ప్రాంతంలో రాజా కోటగిరి వెంకటకృష్ణారావు ప్రథమ సత్యాగ్రహ దళానికి సర్వసేనానిగా ఎన్నికయ్యారు. విజయవాడ ఆంధ్రరత్న భవనం లో సత్యాగ్రహ శిబిరాన్ని ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు ప్రారంభించారు. ఈ శిబిరంలో నాటి నవయువకుడు కాకాని వెంకటరత్నం పాల్గొన్నారు. 1930 ఏప్రిల్‌ 9న సర్వసేనాని కోటగిరి వెంకటకృష్ణారావు ఆధ్వర్యాన ఆంధ్రరత్న భవనం నుంచి 120 మంది దళం సత్యాగ్రహ యాత్రకు బయలుదేరింది. కాకాని ఈ మొదటి దళంలో మొదటి వరుసలో నిలిచారు. ఈ దళంలో ఇతర సత్యాగ్రహులు నూకల వీరరాఘవయ్య, పిడికిటి రామకోటయ్య, కాకుమాను లక్ష్మయ్య, కాట్రగడ్డ మధుసూదనరావు, వేలేరు యజ్ఞనారాయణ శాస్త్రి, పేట బాపయ్య, పిడికిటి మాధవరావు. కుర్రా వెంకటరత్నం, అన్నే కేశవార్య, వల్లభనేని వెంకటరావు, పిడికిటి నారాయణమూర్తి, చెన్నుపాటి మురహరిరావు తదితరులున్నారు. వీరంతా శాంతి గీతాలు పాడుతూ విజయవాడలోని మొగల్రాజపనురం, పటమటలంక, పటమట, పోరంకి, ఈడుపుగల్లు, పునాదిపాడు, నెప్పల్లి, కాకానిగారి ఊరు ఆకునూరు, ఉయ్యూరు, కమ్మమూరు మీదుగా సాగారు. మచిలీపట్నం (బందరు) చేరారు. ఆకునూరు నుంచి సర్వసేనాని కోటగిరి వారు గుర్రం ఎక్కి దళాన్ని ముందుకు నడిపించారు. మచిలీపట్నం చేరిన తూర్పు, పశ్చిమ కృష్ణా సత్యాగహ దళాలకు కోటగిరి నాయకత్వంలో చిన్నాపురం వద్ద సముద్రతీరంలో ఉప్పు తయారు చేసి చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ ఉప్పును కాంగ్రెస్ సభల్లో ప్రజలకు విక్రయించారు. ఆ దళం ఆరుదళాలుగా ఏర్పడి 64 గ్రామాలలో ఉప్పు విక్రయించి గాంధీజీ పిలుపును శిరసావహించింది. ఈ క్రమంలో 1930 జూన్ 27న కాకాని వెంకటరత్నం గారిని అరెస్టు చేసి రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. బళ్లారి క్యాంపు జైలలు ఉంచారు. అయితే 1931లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక మేరకు సత్యాగ్రహులు విడుదలయ్యారు.
1931లో కాకాని వెంకటరత్నం జైలు నుంచి విడుదలైనా బయటికి వచ్చాక పరిస్థితులు ఏమీ సవ్యంగా లేవు. రైతాంగాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. అసలే ఆర్ధికమాంద్యం. ధరలు ఆకాశాన్నంటాయి. ఇదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రైతులమీద భూమిశిస్తును పెంచింది. రూపాయికి మూడు అణాల శిస్తు పెంచాలని నిర్ణయించింది. ఈ అదనపు శిస్తు రద్దుకు సాగిన పోరాటానికి ఆచార్య గోగినేని రంగనాయకులు '(ఎన్జీరంగా) నాయతక్వం వహించారు. ఈ సమయంలోనే ఆచార్య రంగాతో కాకాని వెంకటరత్నానికి పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పన్నుల చెల్లింపు నిరాకరణకు పిలుపునిచ్చింది. పశ్చిమ కృష్ణాలో ఈ ఉద్యమానికి కాకాని వెంకటరత్నం, నూకల వీరరాఘవయ్య, పేట బాపయ్య, కాట్రగడ్డ మధుసూదనరావు తదితరులు నాయకత్వం వహించారు.


1932 శాసనోల్లంఘన ఉద్యమం-కాకాని వెంకటరత్నం

1932లో మరోసారి శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. కాకాని సహచరులు పేటబాపయ్య తదితరులను ఆంధ్రరత్నభవనంలో అరెస్టు చేశారు. ఉద్యమనేతలుగా వారి స్థానంలో కాకుమాను లక్ష్మయ్య, వేదాంతం శంభుశాస్త్రిని నియమించారు. వీరి అరెస్టు తర్వాత కాకాని పశ్చిమ కృష్ణా జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమాన్ని ఉధృతంగా నడిపారు.ఈ క్రమంలో దళాలపై పోలీసులు దారుణ నిర్బంధకాండకు దిగారు. సత్యాగ్రహులపై లాఠీచార్జి చేశారు.కాకాని వెంకటరత్నాన్ని 1932 జూన్ 16న అరెస్టు చేసి రెండేళ్లు తంజావూరు జైల్లో వుంచారు.
అంతేకాకదు...రూ.200జరిమానా విధించారు.అదే ఏడాది డిసెంబర్ చివరలో కాకానిని విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.
గాంధీజీని నిర్బంధించి ఎరవాడ జైలులో ఉంచారు. అదే సమయంలో గాంధీజీ అస్పృశ్యతా నివారణకు పోరాడారు. ప్రాయోపదీక్ష చేశారు. మహాత్మునికి సంఘీభావంగా కాకాని, ఆయన ముఖ్యస్నేహితులు అన్నే అంజయ్య ఆధ్వర్యంలో 30మంది ఆధ్వర్యంలో శాంతి యాత్ర జరిగింది. గ్రామ గ్రామాన బహిరంగ సభలు నిర్వహించారు.పుస్తక రచయిత కలపాల సూర్యప్రకాశరావు కూడా కాకానితో కలసి సభల్లో పాల్గొన్నారు.అస్పృస్యతా వ్యతిరేక సందేశమిచ్చారు.నాటి హరిజనవాడల్లో ఏర్పాటైన సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు.
1933లో కృష్ణా జిల్లాకు వచ్చిన మహాత్మాగాంధీ వెంట నడిచారు.మహాత్ముని ఆధ్వర్యంలో దళితులను దేవాలయ ప్రవేశం చేయించారు.

పరిపాలనా దక్షుడు కాకాని

ఓ వైపు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే,మరోవైపు కాకాని వెంకటరత్నం ప్రజా సమస్యలపై పోరాడారు. 1934నుంచి1937వ సంవత్సరం దాకా ఆయన ఆకునూరు సర్పంచ్ గా పనిచేశారు.గ్రామంలో అనేక సదుపాయాలు,సౌకర్యాలు కల్పించారు. 1937లో మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ మంత్రిమండలిలో స్థానిక స్వపరిపాలన మంత్రి బెసవాడ గోపాలరెడ్డిని ఆకునూరుకు ఆహ్వానించి సత్కరించారు.ఈ పరిపాలనానుభవంతో ఆయన భవిష్యత్తులో కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడయ్యారు. తర్వాత రాష్ట్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ అనుభవం అక్కరకొచ్చింది.

జిల్లా కాంగ్రెస్ నేతగా... 

1936లో కాకాని వెంకటరత్నం పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజరుగా వ్యవహరించారు. గ్రామగ్రామాన తిరిగి యువతలో స్ఫూర్తినింపారు. జస్టిస్ పార్టీ సవాళ్లను ఎదుర్కొని కాంగ్రెస్ ను బలోపేతం చేశారు. 1937అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ అర్బన్ నుంచి కాకాని గురువు అయ్యదేవర కాళేశ్వరరావు మద్రాసు శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. కాట్రగడ్డ నారాయణరావు,.వాసిరెడ్డి దుర్గా సదాశివేశ్వర ప్రసాద్‌(జయంతిపురం రాజా)పశ్చిమ ‌కృష్ణారూరల్‌ ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. వీరి విజయంలో కాకాని వెంకటరత్నం కీలక పాత్ర పోషించారు. నిడమానూరులో సభ ఎలా నిర్వహిస్తారో అని సవాలు విసిరిన జస్టిస్ పార్టీ జమీందార్లకు సాహసంతో జవాబు చెప్పారు. గ్రామమంతా రాత్రి పర్యటించి అందరినీ నిద్రలేపి సభ నిర్వహించారు. జస్టిప్ పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న కోలవెన్ను లాంటి గ్రామాలను కాంగ్రెస్ వైపు మళ్లించారు. ఎన్నికల తర్వాత కాకాని వెంకటరత్నం పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. పేట బాపయ్య అధ్యక్షులయ్యారు..తిరువూరు తాలూకా తునికిపాడు,నందిగామ తాలూకా వీరులపాడు రాజకీయ పాఠశాలల నిర్వహణలో కాకాని వెంకటరత్నం ముఖ్యపాత్ర పోషించారు.

మునగాల రైతాంగ పోరాటం

1937 ఎన్నికల్లో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు రెవెన్యూ మంత్రి అయ్యారు. అయ్యదేవర కాళేశ్వరరావు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సమయంలో పశ్చిమ కృష్ణా జిల్లాలో జమీందారుల దుర్మార్గపు పోకడ సమస్యగా మారింది. ప్రైవేటు సైన్యాలతో ప్రజల మీద జులుం చేస్తున్నారు. సివిల్, క్రిమినల్ అధికారాలన్నీ చెలాయిస్తున్న సమయం. సాగు భూముల నుంచి రైతులను తొలగించి ఇష్టమైన వాళ్లకు అప్పగిస్తున్నారు జమీందార్లు. వాళ్ల అరాజకాలు హద్దు మీరాయి. జమీందార్లు దోపిడీలో బందిపోట్లలా తయ్యారయ్యారు. కాకాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా రైతు సంఘం పక్షాన రంగంలోకి దిగి ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఈ అంశాలను కాకాని వెంకటరత్నం ద్వారా ప్రకాశం పంతులు దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది. అలాగే తిరువూరు తాలూకా కొండపర్వలో జమీందారు ఆగడాలు శృతి మించాయి. రైతులకు భూములు సాగుచేసుకునే హక్కులేకుండా చేస్తున్నాడు. దీనిపై ఉద్యమించిన నాయకుల్లో పేటబాపయ్య అరెస్టయ్యారు. కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో బాపయ్య విడుదలయ్యారు.


నాడు కొండపర్వ దివాణం ఎదురుగా ఏర్పాటైన విజయోత్సవ సభకే కాకాని వెంకటరత్నం అధ్యక్షత వహించారు. తర్వాత కాంగ్రెస్ సభ్యత్వ వివరాలను నేరుగా అఖిలభారత కాంగ్రెస్ కు సమర్పించటంతో రాష్ట్ర కాంగ్రెస్ కాకాని వెంకటరత్నం, పేట బాపయ్యలను రెండేళ్లు కాంగ్రెస్ నుంచి బహిష్కరించింది. తర్వాత జరిగిన జిల్లా బోర్డు ఎన్నికలు ఒక ప్రహసనంగా ముగిశాయి. కోలపల్లి లక్ష్మయ్య నాయుడు జిల్లా బోర్డు అధ్యక్షులయ్యారు. కానీ ప్రభుత్వం ఆ బోర్డును రద్దు చేసింది. అనంతరం మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గొట్టిపాటి బ్రహ్మయ్య ఓడిపోయారు.

క్విట్ ఇండియా ఉద్యమం

భారత స్వాతంత్ర్య సమరానికి పతాక ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8 వ తేదీన మహాత్మాగాంధీ ముంబయ్ గోవాలియా టాంక్ మైదానంలో 'డూ ఆర్ డై' అనే నినాదమిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ‘క్విట్ ఇండియా’ అనే నినాదం ఉద్యమనాదం గా దూసుకెళ్లింది. అదేదో ఆషామాషీ నినాదం కాదు. భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షను పదునుగా ప్రతిఫలించిన రణ నినాదం.
 బొంబాయి లో అఖిలభారత కాంగ్రెస్ మహాసభ బ్రిటిషు వాళ్లు తక్షణం ఈ దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ..క్విట్ ఇండియా తీర్మానం చేసింది. ఈ క్రమంలో దేశ మంతా క్విట్ ఇండియా ఉద్యమం రాజుకుంది. ఉప్పెనై ముంచెత్తుతుందని బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్నారు. క్విట్ ఇండియా ఉద్యమానికి ఏర్పాట్లు చేస్తున్న కాకాని వెంకటరత్నాన్ని విజయవాడలో అరెస్టు చేశారు. రాయవేలూరు జైల్లో ఉంచారు. అదే సమయంలో కాకాని వెంకటరత్నం సోదరుడు కాకాని కోటయ్య కలరా సోకటంతో మరణించారు. ఆరోగ్యం దెబ్బతినటంతో కాకాని వెంకటరత్నాన్ని పెరోలు మీద విడుదల చేశారు. కాంగ్రెస్ మీద నిషేధం ఉంది. పెరోలు పై బయటికి వచ్చిన కాకాని మళ్లీ జైలుకు వెళ్లారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్టులు ఇది అవకాశంగా తీసుకొని బలపడాలని యత్నిస్తున్నారు.
1946లో పశ్చిమ కృష్ణా కాంగ్రెస్ కమిటీని రద్దు చేసి కాకానిని ఇన్ చార్జిగా నియమించారు. ఈ అవకాశాన్ని ఆయన చక్కగా ఉపయోగించుకున్నారు. 1946లో పెను తుఫాను వల్ల ఆంధ్ర కోస్తా ప్రాంతం బాగా నష్టపోయింది. ఈ క్రమంలో ప్రకాశం పంతులు పశ్చిమ కృష్ణా ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన వెంట కాకాని వెంకటరత్నం,
ఈ పుస్తక రచయిత కలపాల సూర్యప్రకాశరావు ఉన్నారు. ప్రకాశం పంతులు కాకానిని తుఫాను పునరావాస కమిటీకి చైర్మన్ గా నియమించారు. తుఫాను నిధి వసూలు చేసి దాతలకు రశీదులు ఇచ్చారు. అంత నిజాయతీగా ఉండేవారు. లెక్కలు, జమా, ఖర్చులలో పారదర్శకంగా ఉండేవారు. బాధితులకు ఆ సొమ్మును పంపిణీ చేశారు.
1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య సంబరాల్లో కాకాని పాల్గొన్నారు. 1948లో పశ్చిమ కృష్ణా కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. పేటబాపయ్య కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కొన్ని సంస్థానాలు దేశంలో విలీనం కాలేదు. తెలంగాణలో నిజాం నవాబు నిరంకుశ పాలన అంతంకాలేదు. రజాకార్లు కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా దాడులు సాగిస్తున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్న సమయం అది. నజాం సర్వసైన్యాధిపతి కాశిం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు గ్రామాల మీద పడి హింసాకాండకు పాల్పడుతున్నారు. అక్కడ నిర్బంధాలు, దాడులు, హింస తట్టుకోలేక నైజాం ప్రజలు సరిహద్దులోని పశ్చిమ కృష్ణ ప్రాంత గ్రామాలకుత తరలి వచ్చి తలదాచుకుంటున్నారు. నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, వల్లూరు బసవరాజు, టి. హయగ్రీవాచారి, మాడపాటి హనుమంతరావు, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి తదితరులు కొంతకాలం విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు సహాయపడేందుకు రిలీఫ్ కమిటీ ఏర్పడింది. అయ్యదేవర కాళేశ్వరరావు ఈ కమిటీకి అధ్యక్షులు. మరో వైపు కమ్యూనిస్టులు ఆంధ్రలో తలదాచుకుంటూ కాంగ్రెస్ కూడా ఆంధ్రలో కాంగ్రెస్ కు సవాలుగా మారారు. ఈ క్రమంలో నిజాం నవాబు మీద పోలీసు యాక్షన్ కు దిగాలని నిజాం స్టేట్ రెసిడెంట్ కు కాకాని వెంకటరత్నం సూచించారు.
1949 నవంబర్ లో జిల్లా బోర్డు ఎన్నికలు నిర్వహించటానికి మద్రాసు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎన్నికలలో కాకాని వెంకటరత్నం ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఆయన జిల్లా బోర్డు అధ్యక్షులయ్యారు. ప్రతి గ్రామంలో ఒక పాఠశాల నెలకొల్పారు. శిథిల స్థితికి చేరిన పాఠశాల భవనాల స్థానంలో ప్రభుత్వ గ్రాంటు లేదా దాతల సాయంతో కొత్తభవనాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. ఉపాధ్యాయులను పెద్ద సంఖ్యలో నియమించారు. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ వేతన స్కేళ్లు ఇప్పించారు. అంతే కాదు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు కాకాని. ఉపాధ్యాయులను సెకెండరీ, ఎలిమెంటరీ వివక్ష లేకుండా సమానంగా ఆదరించారు. ప్రధానోపాధ్యాయుడు కావాలంటే ఏడేళ్ల సర్వీసు చాలని జీఓ వచ్చేలా చేశారు.
 ఉపాధ్యాయులకు శిక్షణ కాలంలో స్టయిపండ్ ఏర్పాటు చేయించారు.కృష్ణా జిల్లాలోనే 100 ప్రాథమిక, మాధ్యమిక , ఉన్నత పాఠశాలలు నెలకొల్పారు. పెద్దగా చదువు కోలేదు. అందువల్ల ఆయనకు విద్యారంగం అంటే అభిమానం. విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవటంలో కాకానిది కీలకపాత్ర. ప్రభుత్వోద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు కరవు భత్యం ఇచ్చేందుకు కృషి ఆయన కృషి గుర్తుండిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల జీతాల స్కేళ్లను బోర్డు పాఠశాలల ఉపాధ్యాయులకు ఇప్పించారు. కేంద్ర జలవనరుల మంత్రి కె. ఎల్ రావు సహకారంతో బుడమేరు మురుగు నివారణ పథకం తెచ్చారు.



 ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు

1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యారు. 1954లో బెంగాల్ లో కల్యాణి లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి కాకాని హాజరయ్యారు.
1955లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాకాని వెంకటరత్నం ఉయ్యూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1956 మార్చి 3వ తేదీన పండిట్ నెహ్రూ విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించారు. 1956 అక్టోబర్ 21న ఆంధ్ర, తెలంగాణ, కాంగ్రెస్ శాసన సభ్యులు విశాలాంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకుని ఎన్నిక కోసం కర్నూలులో సమావేశమయ్యారు. నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి మధ్య పోటీ జరిగింది. కాకాని వెంకటరత్నం బెజవాడ గోపాలరెడ్డి పక్షాన నిలిచారు.
 నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానదిపై ఎక్కడ నిర్మించాలి? నందికొండ వద్దా? సిద్ధేశ్వరం వద్ద కట్టాలా? డాక్టర్ కె.ఎల్ రావు సలహాపై నందికొండ వద్దనే నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ కోరింది. ఆందోళన ప్రారంభించింది. ముక్త్యాల రాజా వి.ఆర్.జి.కె ప్రసాద్‌ నడుంబిగించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతో కృషి ఎంతో కృషి చేశారు.

 భారత్ సేవక్ సమాజ్ కన్వీనరుగా సేవలు

స్వతంత్ర్యాన్యంతరం దేశ పునర్నిర్మాణానికి, మానవవనరుల అభివృద్ధికి భారత్ సేవక్ సమాజ్ ఏర్పాటైంది. అధ్యక్షులుగా కేంద్ర ప్రణాళికా మంత్రి గుల్జారీలాల్ నందా వ్యవహరించారు. ఆంధ్రలో శాఖ ఏర్పాటైంది. సేవక్ సమాజ్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులయ్యారు. సేవక్ సమాజ్ కన్వీనర్ గా ఆయన గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ కాల్వలు తవ్వించారు. కృష్ణాజిల్లా లో బుడమేరు కరకట్టలు పోయించారు.

 సేవక్ సమాజ్ తరపున శ్రమదానానికి యువజనులు ముందుకొచ్చారంటే కాకాని శక్తియుక్తులను అర్ధం చేసుకోవచ్చు. మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు, విద్యార్ధులతో జాతీయ సేవా పథకం శిక్షణ శిబిరాలు ఏర్పటయ్యాయి. బాలల వికాసానికి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలలో నాగులపల్లి సీతారామయ్య, ఈ పుస్తక రచయిత కలపాల సూర్యప్రకాశరావు, అక్కినేని భాస్కరరావు, కస్తల ఉమామహేశ్వరరావు, కుదరవల్లి విశ్వేశ్వరరావు, రేపాల బుచ్చిరామ శేషయ్యశ్‌రేష్టి, చిగురుపాటి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఇంకా కాకాని వెంకటరత్నం సహకార రంగ అభివృద్ధికి కృషిసాగించారు. పూర్వ జమీందార్ల మద్దతుతో సహకార రంగంలో ఉయ్యూరు చక్కెర కర్మాగారం నెలకొల్పటానికి కాకానిది ముఖ్య భూమిక. కాకాని చొరవతో నిత్యావసర వస్తువులను రాయితీపై ఇచ్చేందుకు ఉత్పత్తి కొనుగోలు సంఘాలు ఏర్పాటయ్యాయి. ది విజయవాడ కో-ఆపరేటివ్ పబ్లిషింగ్ అండ్ ప్రింటింగ్ సొసైటీ ఏర్పాటుకు కాకాని కృషి చెప్పుకోదగింది. జిల్లా గ్రంథాలయ సంస్థకు అన్ని హంగులు సమకూరాయి. ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీని కళ్లారా చూడాలని కలలు కన్నారు. ఆయన హయాంలో ఈ భవనం పూర్తి కాలేదు. జిల్లాలో మార్కెటింగ్ సొసైటీల స్థాపనలో అవిరళ కృషి చేశారు. కాకాని అధ్యక్షతన 1961లో ఆర్టీసీ నేషనల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటైంది. గ్రంథాలయోద్యమానికి తనవంతు తోడ్పాటు అందించారు. 1964 నుంచి ఆంధ్ర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాత్రిపూట బస్సులు నడిపించేందుకు కాకాని ఆర్టీసిని ఒప్పించారు.
 రాయలసీమ కరువు నేపథ్యంలో కాకాని ఆధ్వర్ంలో కరవు సహాయ కమిటీ ఏర్పాటైంది. ధాన్యం, పశుగ్రాసం, వస్త్రాలు, నిత్యావసర వస్తువులను సేకరించి పంపించారు.

1962లో శాసనసభకు ఎన్నిక

1962లో శాసన సభ ఎన్నికల్లో కాకాని వెంకటరత్నం ఉయ్యూరు జనరల్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డిని తన స్వగ్రామం ఆకునూరుకు తీసుకొచ్చి ఘన సన్మానం చేశారు. కోర్టు తీర్పు మేరకు తర్వాత సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి గా వచ్చారు. కాకాని కాసు అంతరంగికులలో ఒకరుగా మారారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంలో కాకాని వెంకటరత్నాన్ని విజయవాడ పురవీధుల్లో ఊరేగించారు.

 1967లో కాకాని వెంకటరత్నం ఉయ్యూరు నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. 1967లో కాకాని వెంకటరత్నం పిసిసి అధ్యక్షులయ్యారు.

 రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాని వెంకట రత్నం

1968లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి జరిగిన ఉప ఎన్నికలో కాకాని వెంకట రత్నం గెలిచారు. 1969లో కాసుబ్రహ్మానందరెడ్డి మంత్రిమండలి విస్తరణలో కాకానికి చోటు దక్కింది. . వ్యవసాయం, పశుపోషణ, పాడిపరిశ్రమల శాఖల మంత్రి అయ్యారు. కాకాని వెంకటరత్నం మట్టి మనిషి. బంగారు మనిషి. ఉక్కుమనిషి.అన్నింటికంటే మనసున్న మనిషి. అచ్చమైన కృషీవలుడు. వ్యవసాయం అంటే ప్రాణం. గుడివాడ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో ఉప్పు సత్యాగ్రహంలో తనతో కలసి పాల్గొన్న సాధ/ సుబ్రహ్మణ్యం ను అభ్యర్ధిగా ఎంపిక చేసి గెలిపించారు. కాకాని మంత్రిగా ఉండగా తుఫాను వచ్చింది. బుడమేరుకు ఇరువైపుల గ్రామాలు, పంటపొలాలు వరదనీట మునిగాయి. విజయవాడ, గన్నవరం, గుడివాడ తాలూకాలు బాగా దెబ్బతిన్నాయి. విజయవాడ నుంచి బయలుదేరి నీటమునిగిన ప్రాంతాలలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించఇ ధైర్యం చెప్పారు. మురుగు కోడును తవ్విస్తానని హామీ ఇచ్చారు. 1969లో కాంగ్రెస్ పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ గా చీలిపోయినప్పుడు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి వెంట ఉన్నారు. కొత్త కాంగ్రెస్ ను సమర్ధించారు. బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభలకు కాకాని హాజరయ్యారు. పాడి పరిశ్రమ మీద అధ్యయనానికి మహారాష్ట్ర-గుజరాత్ లలో పర్యటించారు. మిల్కు కమిషనర్ ప్రకాశరావు, ఈ పుస్తక రచయిత కె. సూర్యప్రకాశరావు , అంతరంగిక కార్యదర్శి సూరపనేని వెంకటేశ్వరరావు ఆయన బృందంలో సభ్యులు. 1964 డిసెంబర్ 27న బొంబాయి వర్లీలోని విశాల డెయిరీ ఫారాన్ని సందర్శించారు. అక్కడ పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్కే మిల్కుకాలనీని, పశుసంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నుంచి ఎల్ అండ్ టి సంస్థ సదర్శన సాగింది. పాల శీతలీకరణ యంత్రాలను ఇక్కడ తయారు చేస్తారు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పాలు చెడిపోకుండా సరఫరా చేసే వ్యానుల నుంచి సీసాల వరకు ఇక్కడ తయారవుతాయి. అంతవరకూ ఏ పాడిపరిశ్రమ మంత్రీ తమ ప్లాంటును సందర్శించలేదని ఆ కంపెనీ మేనేజర్ అన్నారు. అలాంటి యంత్రాలను, వ్యానులను, సీసాలను మనదగ్గరికి తేవాలని, ఇక్కడ పాల సరఫరా పథకం ప్రవేశపెట్టాలని మంత్రి కాకాని వెంకటరత్నం నిర్ణయించారు. తర్వాత ఈ దేశంలో క్షీర విప్లవానికి శంఖారావం పూరించి దిశానిర్దేశం చేసిన గుజరాత్ అమూల్ ప్లాంటులను సందర్శిచారు. ఆనంద్‌ పట్టణానికి వెళ్లి అక్కడి 'ఆనంద్ మిల్క్ యూనిట్'(అమూల్‌) కు వెళ్లి అధ్యయనం చేశారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో సంబంధం లేకుండా రైతులే సహకార రంగంలో ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద పాడిపరిశ్రమ అది.
 ప్రజల ధనంతో, వారి భాగస్వామ్యంతో నడుస్తోంది. ఆనంద్ సహకార సంస్థలో వేలాది సభ్యులున్నారు. ప్రతి ఏటా వారికి లాభాలతో పాటు బోనస్ పంచుతున్నారు. అక్కడి పశుసంవర్థక కేంద్రాలు, సెమెన్ బ్యాంకులు, కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాలు అమూల్ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. గుజరాత్ లో అమూల్ ఒక పర్యాటక కేంద్రంగా మారిన విశేషాన్ని కళ్లారా చూశారు. ఆంధ్రప్రదేశ్‌ లో కూడా గుజరాత్ పాడిపరిశ్రమాభివృద్ధి తరహా పథకాలను ప్రవేశపెట్టాలని కాకాని వెంకటరత్నం నిశ్చయించారు. రాష్ట్రమంత్రా క్రమేణా పశుగణాభివృద్ధి కేంద్రాలు , పాల ప్రాజెక్టులు,. పశువైద్యశాలలు, ఉపకేంద్రాలు నెలకొల్పారు. వివిధ ప్రదేశాలలో పాలశీతలీకరణ కేంద్రాలు నెలకొల్పారు. సమగ్ర పాల ప్రాజెక్టులు వచ్చాయి. గ్రామగ్రామానా పాలశీతలీకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.లక్షల లీటర్ల పాలు సమకూరాయి. పట్టణ వాసుల అవసరాలకు అనుగుణంగా పాలసరఫరా ఆరంభమైంది. కలకత్తా, మద్రాసు, హైదరాబాద్ నగరాలకు పాలు ఎగుమతయ్యాయి. నేడు రాష్ట్రంలో పాడిపరిశ్రమాభివృధ్ధికి ఆనాడు మంత్రి కాకాని వెంకటరత్నం అరళకృషే కారణం. సన్నకారు, చిన్నకారు రైతులకు రుణాలు మంజూరు చేసి పాడిగేదెలను అప్పుగా ఇప్పించారు. గుజరాత్ నమూనా పాడిపరిశ్రమను తీర్చిదిద్దటానికి నాంది పలికారు. పల్లెల్లో సామాన్య కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించాయి. రైతులకు కాడి కావాలి, పాడి కావాలన్న కాకాని ఆకాంక్షించారు. మంత్రిగా తన పదవీకాలంలో అందుకు క్షేత్రస్థాయిలో కృషి రస్త్రశారు.
 కాకాని వ్యవసాయంమంత్రి అయిన తొలినాళ్లలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో వరి పైరుకు హిస్పా తెగులు వ్యాపించింది. శాస్త్రవేత్తల హెచ్చరికలతో అప్రమత్తమై విమానాల ద్వారా వరి కీటక నాశినులను జల్లించి చీడ పీడలను అదుపులోకి తెచ్చారు. (సశేషం)

పరిపాలనా దక్షుడు కాకాని

ఓ వైపు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే,మరోవైపు కాకాని వెంకటరత్నం ప్రజా సమస్యలపై పోరాడారు. 1934నుంచి1937వ సంవత్సరం దాకా ఆయన ఆకునూరు సర్పంచ్ గా పనిచేశారు.గ్రామంలో అనేక సదుపాయాలు,సౌకర్యాలు కల్పించారు. 1937లో మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ మంత్రిమండలిలో స్థానిక స్వపరిపాలన మంత్రి బెసవాడ గోపాలరెడ్డిని ఆకునూరుకు ఆహ్వానించి సత్కరించారు.ఈ పరిపాలనానుభవంతో ఆయన భవిష్యత్తులో కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడయ్యారు. తర్వాత రాష్ట్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ అనుభవం అక్కరకొచ్చింది.